శభాష్‌.. హీరోస్‌
ఉత్సాహంగా ‘ఈనాడు ఛాంపియన్‌ క్రికెట్‌ కప్‌-2018’ రాష్ట్రస్థాయి లీగ్‌ పోటీలు
జూనియర్స్‌, సీనియర్స్‌ విభాగాల్లో హైదరాబాద్‌ హీరోస్‌ ప్రతిభ
తిరుపతి(తాతయ్యగుంట), న్యూస్‌టుడే: సొగసైన బ్యాటింగ్‌.. ఔరా అనిపించేలా బౌలింగ్‌తో క్రీడాకారులు ఆకట్టుకున్నారు. బ్యాట్స్‌మెన్ల బౌండరీల మోతతో మైదానంలో సందడి నెలకొంది. అటు సీనియర్స్‌, ఇటు జూనియర్స్‌ జట్లు దూకుడు పెంచుతూ ప్రత్యర్థి జట్ల ముందు భారీ లక్ష్యాన్ని ఉంచాయి. రెండు విభాగాల్లోనూ హైదరాబాద్‌ హీరోస్‌ జట్లు విజయాన్ని తమ ఖాతాల్లో వేసుకున్నాయి. స్ప్రైట్‌ సమర్పించు ‘ఈనాడు ఛాంపియన్‌ క్రికెట్‌ కప్‌-2018’ రాష్ట్రస్థాయి లీగ్‌ పోటీలు రెండో రోజైన శుక్రవారం ఉత్సాహంగా సాగాయి. తిరుపతి ఎస్వీయూ తారకరామ క్రీడా మైదానంలో ఉదయం సీనియర్స్‌కు, మధ్యాహ్నం జూనియర్స్‌కు పోటీలు జరిగాయి. వీటిని తిలకించడానికి పెద్దఎత్తున యువకులు, విద్యార్థులు తరలివచ్చారు. సీనియర్స్‌, జూనియర్స్‌ విభాగాల్లో సెంట్రల్‌ ఆంధ్రా ఛాలెంజర్స్‌ జట్లపై హైదరాబాద్‌ హీరోస్‌ జట్లు ఘన విజయం సాధించాయి.

సత్తాచాటిన హైదరాబాద్‌ హీరోస్‌
టీ20 ఈసీసీ రాష్ట్రస్థాయి లీగ్‌ పోటీల్లో భాగంగా సీనియర్స్‌ విభాగంలో సెంట్రల్‌ ఆంధ్రా ఛాలెంజర్స్‌పై హైదరాబాద్‌ హీరోస్‌ జట్టు గెలిచి.. పాయింట్లను తన ఖాతాలో వేసుకొంది. హైదరాబాద్‌ హీరోస్‌ జట్టు తొలుత టాస్‌ గెలిచి పీÆల్డింగ్‌ ఎంచుకుంది. సెంట్రల్‌ ఆంధ్రా ఛాలెంజర్స్‌ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ హీరోస్‌ జట్టు 4వికెట్లు కోల్పాయి 19 ఓవర్లలో 143 పరుగులు చేసి.. విజయాన్ని కైవసం చేసుకుంది. సెంట్రల్‌ ఆంధ్రా ఛాలెంజర్స్‌లో జితేంద్ర 52 బంతుల్లో 56 పరుగులు చేయగా, హైదరాబాద్‌ హీరోస్‌ జట్టులో కార్తీక్‌ 44 బంతుల్లో 53 పరుగుల వ్యక్తిగత స్కోరు నమోదు చేశారు.

జూనియర్స్‌ దూకుడు
తారకరామ స్టేడియంలో మధ్యాహ్నం జరిగిన జూనియర్స్‌ విభాగంలో సెంట్రల్‌ ఆంధ్రా ఛాలెంజర్స్‌, హైదరాబాద్‌ హీరోస్‌ జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్‌ హీరోస్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. భారీ లక్ష్య ఛేదనతో బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్‌ ఆంధ్రా ఛాలెంజర్స్‌ 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి కేవలం 81 పరుగులు మాత్రమే చేసింది. అంతకుముందు హైదరాబాద్‌ హీరోస్‌ ఆటగాళ్లు దూకుడుగా బ్యాటింగ్‌ చేశారు. ప్రత్యర్థి జట్టుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. హీరోస్‌ జట్టులో ఐల్యాన్‌ 29 బంతుల్లో 45 పరుగులతో, సెంట్రల్‌ ఆంధ్రా ఛాలెంజర్స్‌లో కృష్ణ 49 బంతుల్లో 33 పరుగులతో నాటౌట్‌గా నిలిచారు.

మరిన్ని

ఈరోజు మ్యాచ్‌లు

    ఉత్తరాంధ్ర
    సెంట్రల్‌ ఆంధ్ర
    గ్రేటర్‌
    తెలంగాణ
    రాయలసీమ

© 1995- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.