చెలరేగిన.. రాయలసీమ రాకర్స్‌
జూనియర్‌, సీనియర్‌ జట్ల ప్రతిభ
నార్త్‌ ఆంధ్రా నింజాస్‌ గైర్హాజరు
తెలంగాణ టైగర్స్‌కు అదనపు పాయింట్లు
ఆసక్తికరంగా టీ20 ఈసీసీ-2018 పోటీలు
తిరుపతి(క్రీడలు), (రైల్వే), న్యూస్‌టుడే: స్ప్రైట్‌ సమర్పించు ‘ఈనాడు ఛాంపియన్‌ క్రికెట్‌ కప్‌-2018’ రాష్ట్ర  లీగ్‌ పోటీలు గురువారం ప్రారంభమయ్యాయి. తిరుపతిలోని ఎస్వీయూ తారకరామ స్టేడియం, గ్రామీణ మండలం తుమ్మలగుంట క్రికెట్‌ మైదానం వేదికగా నాలుగు రోజులపాటు జరగనున్న పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాలు(ఏపీ, తెలంగాణ) జిల్లాల నుంచి రీజినల్‌ స్థాయిలో విజేతలుగా నిలిచిన జట్లు తరలివచ్చాయి. ఎస్వీయూ తారకరామ స్టేడియంలో జూనియర్‌ జట్లు, తుమ్మలగుంట క్రికెట్‌ మైదానంలో సీనియర్‌ జట్లకు పోటీలు నిర్వహించారు. మొదటి రోజు జరిగిన పోటీల్లో జూనియర్‌, సీనియర్‌ విభాగంలో సెంట్రల్‌ ఆంధ్రా ఛాలెంజర్స్‌పై రాయలసీమ రాకర్స్‌ చెలరేగిపోయారు. మధ్యాహ్నం తెలంగాణ టైగర్స్‌, నార్త్‌ ఆంధ్రా నింజాస్‌ మధ్య జరగాల్సిన పోరుకు నార్త్‌ ఆంధ్రా నింజాస్‌ గైర్హాజరు కావడంతో తెలంగాణ టైగర్స్‌ జూనియర్‌, సీనియర్‌ జట్లకు అదనపు పాయింట్లు లభించాయి.
మొదటి రోజు ఫలితాలు ఇలా..
రాయలసీమ రాకర్స్‌ ప్రతిభ
టీ20 ఈసీసీ రాష్ట్ర ఫైనల్‌ లీగ్‌ పోటీల్లో భాగంగా జూనియర్‌ విభాగంలో తుమ్మలగుంట క్రికెట్‌ మైదానం వేదికగా జరిగిన పోరులో రాయలసీమ రాకర్స్‌ జట్టు ప్రతిభ చూపింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాయలసీమ రాకర్స్‌ జట్టు 19.2 ఓవర్లలో 133 పరుగులు చేసి అలౌటైంది. జట్టులో డి.ఖాదర్‌వల్లీ 35 బంతుల్లో 41 పరుగులు చేశారు. ఇందులో నాలుగు ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. అతనికి తోడుగా ఆజాద్‌ పది బంతుల్లో 20 పరుగులు(4×3, 6×1) చేశాడు. ఆజాద్‌ బౌలింగ్‌లోనూ రెండు వికెట్లు పడగొట్టి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్‌ ఆంధ్రా ఛాలెంజర్స్‌ 17.5 ఓవర్లకే వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది.

సీనియర్‌ విభాగంలోనూ రాకర్స్‌ ఘన విజయం
తుమ్మలగుంట మైదానం వేదికగా జరిగిన సీనియర్‌ విభాగంలోనూ రాయలసీమ రాకర్స్‌ జట్టు ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి సెంట్రల్‌ ఆంధ్రా ఛాలెంజర్స్‌పై నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సెంట్రల్‌ ఆంధ్రా ఛాలెంజర్స్‌ 19.5 ఓవర్లలో 129 పరుగులు చేసి ఆలౌటైంది. జట్టులో పి.అఖిల్‌ 46 బంతుల్లో 61 (4×4, 1×6) పరుగులు చేశాడు. అనంతరం 130 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన రాయలసీమ రాకర్స్‌ 19.4 ఓవర్లల్లోనే లక్ష్యాన్ని చేరుకుంది. జట్టులో ఎం.గురివిరెడ్డి 42 బంతుల్లో 41 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, ఒక సిక్సర్‌ ఉన్నాయి. ఎం.మదన్‌కుమార్‌ 25 బంతుల్లో 41 పరుగులు(4×5) చేశాడు. దీంతో నాలుగు వికెట్ల తేడాతో రాయలసీమ రాకర్స్‌ ఘన విజయం సాధించింది.

ప్రతిభావంతులను వెలుగులోకి తెస్తున్న ఈనాడు, ఈటీవీ
ఎస్వీయూ ఇన్‌ఛార్జి వీసీ జానకిరామయ్య
గ్రామీణ స్థాయి నుంచి అన్ని రంగాల్లో ప్రతిభావంతులను ఈనాడు, ఈటీవీ వెలుగులోకి తీసుకువస్తున్నాయని శ్రీవేెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జి వీసీ ఆచార్య జానకిరామయ్య తెలిపారు. స్ప్రైట్‌ సమర్పించు ఈసీసీ కప్‌-2018 రాష్ట్ర స్థాయి లీగ్‌ క్రికెట్‌ పోటీలు గురువారం తిరుపతిలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఎస్వీయూ తారకరామా స్టేడియంలో తిరుపతి ఈనాడు మేనేజరు శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన వీసీ మాట్లాడుతూ.. ఈనాడు అధినేత రామోజీరావు వ్యాపార దృక¢్పథంతో కాకుండా సమాజంలో వివిధ రంగాల్లో ప్రతిభావంతులను వెలికి తీసి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న గొప్ప దార్శనికులని కొనియాడారు. నాలుగుగోడల మధ్య నేర్చుకునే చదువుతో పాటు మైదానాల్లో అడగుపెట్టడం ద్వారా సమాజంలో అన్ని రంగాల్లో రాణించే అవకాశం ఉంటుందన్నారు. బాల బాలికల క్రికెట్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు, భారతీయ విద్యాభవన్‌ డైరెక్టర్‌ నడింపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ సమాజంలో వివిధ రంగాల అభివృద్ధికి ఈనాడు, ఈటీవీ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. రామోజీరావు కేవలం క్రీడలనే కాకుండా గ్రామీణ ప్రాంత రైతులకు కూడా వ్యవసాయంపై అవగాహన కల్పిస్తూ అన్నదాత మాసపత్రికను నడుపుతున్నట్లు వివరించారు. క్రికెట్‌ క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించేందుకు, మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు, వారి సంక్షేమానికి ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ కృషి చేస్తున్నట్లు వివరించారు. ఈనాడు తిరుపతి యూనిట్‌ మేనేజరు శ్రీనివాసులు మాట్లాడుతూ ఈనాడు, ఈటీవీ యాజమాన్యం ప్రతిభ కల్గిన క్రీడాకారులను వెలికి తీసేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ క్రీడలతో పాటు క్రికెట్‌ను ప్రోత్సహిస్తూ వరుసగా పన్నెండేళ్లపాటు ఈనాడు ఛాంపియన్‌షిప్‌ పోటీలను నిర్వహించి గిన్నిస్‌బుక్‌ ఆఫ్‌ రికార్డును నెలకొల్పినట్లు వివరించారు. పురుషులతోపాటు మహిళలకు కూడా గత రెండేళ్లుగా క్రికెట్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. క్రమశిక్షణతో ఈనాడు ఛాంపియన్‌ క్రికెట్‌ పోటీలు జరుగుతున్నాయని క్రీడాకారులు నిబంధనలు పాటించి మంచి పేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన క్రికెట్‌ క్రీడాకారులు  పాల్గొన్నారు.
రెండు రాష్ట్రాల నుంచి జట్లు
ఏపీ, తెలంగాణ జిల్లాల నుంచి రీజినల్‌ స్థాయిలో గెలుపొందిన జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. ఇందులో జూనియర్‌, సీనియర్‌ విభాగాలకు వేర్వేరుగా పోటీలు జరుగుతున్నాయి. రాయలసీమ, సెంట్రల్‌ ఆంధ్రా, నార్త్‌ ఆంధ్రా, అలాగే  తెలంగాణ రాష్ట్రం వరంగల్‌, హైదరాబాద్‌ రీజియన్ల నుంచి సీనియర్స్‌, జూనియర్స్‌ విభాగాలకు సంబంధించిన రెండేసి జట్లు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.

మరిన్ని

ఈరోజు మ్యాచ్‌లు

    ఉత్తరాంధ్ర
    సెంట్రల్‌ ఆంధ్ర
    గ్రేటర్‌
    తెలంగాణ
    రాయలసీమ

© 1995- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.