బంతి బంతికీ ఉత్కంఠ
హోరాహోరీగా ‘ఈనాడు’ ప్రాంతీయ క్రికెట్‌ కప్‌-2018 పోటీలు
రాజానగరం గ్రామీణం, న్యూస్‌టుడే: ‘ఈనాడు’ ఆధ్వర్యంలో స్ప్రైట్‌ సమర్పించు ఈసీసీ(ఈనాడు ఛాంపియన్‌ క్రికెట్‌) కప్‌-2018 ప్రాంతీయ పోటీలు బుధవారం తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని గన్ని సుబ్బలక్ష్మి(జీఎస్‌ఎల్‌) వైద్య కళాశాల, గోదావరి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(గైట్‌) క్రీడా మైదానాల్లో ఉత్కంఠభరితంగా సాగాయి. ఉత్తరాంధ్ర పరిధిలోని విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. జీఎస్‌ఎల్‌ మైదానంలో సీనియర్‌ విభాగం పోటీలు, గైట్‌ కళాశాలలో జూనియర్‌ విభాగం పోటీలు నిర్వహించారు. 20 ఓవర్లతో సాగిన ఈ మ్యాచ్‌లలో క్రీడాకారులు ఉత్తమ ప్రదర్శన కనబరిచారు. ఒక్కో జిల్లా నుంచి సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లో ఒక్కో జట్టు ఆడి గురువారం జరిగే రీజినల్‌ స్థాయి ఫైనల్‌ పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలకు అంపైర్‌లుగా బి.సాయిరామ్‌, శివ, స్కోరర్‌గా అచ్యుతరావు వ్యవహరించారు.

జీఎస్‌ఎల్‌ మైదానంలో..
* శ్రీసత్యసాయి డిగ్రీ కళాశాల(శ్రీకాకుళం) - కైట్‌ ఇంజినీరింగ్‌ కళాశాల(కోరంగి, తూర్పుగోదావరి జిల్లా) జట్ల మధ్య జరిగిన పోటీల్లో సత్యసాయి కళాశాల జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుని 15.3 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 79 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కైట్‌ జట్టు 18.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 82 పరుగులు సాధించింది. ఇందులో కైట్‌ కళాశాల తూర్పుగోదావరి జిల్లా జట్టు విజయం సాధించింది.

* రెండో మ్యాచ్‌లో డాక్టర్‌ లంకపల్లి బుల్లయ్య కళాశాల(విశాఖపట్నం) - జేఎన్‌టీయూకే విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్‌ కళాశాల(విజయనగరం) జట్ల మధ్య జరిగిన పోటీలో జేఎన్‌టీయూకే జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుని 14.5 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 38 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌ బరిలో దిగిన బుల్లయ్య కళాశాల జట్టు నిర్ణీత 2.4 ఓవర్లలో ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా 40 పరుగులు సాధించి విజయలక్ష్యాన్ని ఛేదించి, విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో బుల్లయ్య కళాశాల జట్టు క్రీడాకారులు సత్యనారాయణ 8 బంతుల్లో 20 పరుగులు(2 సిక్స్‌లు, 2 ఫోర్‌లు), వంశీకృష్ణ 14 బంతుల్లో 10 పరుగులు(3 ఫోర్‌లు) సాధించి జట్టు విజయంలో కీలకంగా నిలిచారు. బౌలింగ్‌లో పి.సత్యనారాయణ రాజు 3.4 ఓవర్లు వేసి 13 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీయగా వంశీకృష్ణ 3 ఓవర్లు వేసి 4 పరుగులు ఇచ్చి 2 వికెట్లను తన ఖాతాలో వేసుకుని ఉత్తమ క్రీడాకారులుగా నిలిచారు.

గైట్‌ క్రీడా మైదానంలో..
రాజానగరం, : గోదావరి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(గైట్‌) క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన పోటీల్లో జూనియర్స్‌ విభాగంలో శాతవాహన జూనియర్‌ కళాశాల(హరిపురం, శ్రీకాకుళం జిల్లా) - మెగా జూనియర్‌ కళాశాల(రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా) జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. శాతవాహన జూనియర్‌ కళాశాల జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు సాధించింది. ఈ జట్టులో వాసుదేవ్‌ 21 బంతుల్లో 35 పరుగులు చేశాడు. ప్రవీణ్‌ 35 బంతులలో 52 పరుగులు, వసంత్‌ 14 బంతుల్లో 20 పరుగులు సాధించారు. అనంతరం బ్యాటింగ్‌ ప్రారంభించిన మెగా జూనియర్‌ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో 157 పరుగులకే ఆలౌట్‌ అయింది. ఈ జట్టులో జిలానీ 15 బంతుల్లో 36 పరుగులు సాధించాడు. శాతవాహన జూనియర్‌ కళాశాల జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది.

* లక్ష్మీదేవిగుప్త జూనియర్‌ కళాశాల(ధర్మపురి, విజయనగరం జిల్లా) - బీవీకే జూనియర్‌ కళాశాల(ద్వారకానగర్‌, విశాఖపట్నం) జట్ల మధ్య పోటీ హోరాహోరీగా సాగింది. ఈ పోటీలో లక్ష్మీదేవిగుప్త కళాశాల జట్టు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన బీవీకె కళాశాల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 98 పరుగులకు ఆలౌట్‌ అయింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన లక్ష్మీదేవిగుప్త జూనియర్‌ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 102 పరుగులు సాధించింది. ఈ జట్టులో ఎం.అభిలాష్‌ 20 బంతుల్లో 33 పరుగులు, హేమంత్‌రెడ్డి 13 బంతుల్లో 23 పరుగులు సాధించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ పోటీలో లక్ష్మీదేవిగుప్త కళాశాల జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ పోటీలకు అంపైర్లుగా చిన్ని, రవీంద్ర, స్కోరర్‌గా పంకజ్‌ కుమార్‌ యాదవ్‌ వ్యవహరించారు.

మరిన్ని

ఈరోజు మ్యాచ్‌లు

    ఉత్తరాంధ్ర
    సెంట్రల్‌ ఆంధ్ర
    గ్రేటర్‌
    తెలంగాణ
    రాయలసీమ

© 1995- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.