నువ్వా.. నేనా..?
ఉత్సాహంగా ప్రారంభమైన ఈసీసీ కప్‌-2018 ప్రాంతీయ పోటీలు
పోటాపోటీగా తలపడిన జూనియర్‌, సీనియర్‌ జట్లు
తొలి రోజు రెండు అర్ధ శతకాలతో రాణించిన బ్యాట్స్‌మెన్‌
వరంగల్‌ క్రీడా విభాగం, న్యూస్‌టుడే: వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో ‘ఈనాడు’ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌ ప్రాంతీయ స్థాయి పోటీలు బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలకు చెందిన జూనియర్‌, డిగ్రీ, పీజీ కళాశాలలకు చెందిన 14 జట్ల క్రీడాకారులు పోటీలకు హాజరయ్యారు. తొలి రోజు మ్యాచ్‌ల్లో యువ క్రికెటర్లు తమ జట్ల విజయం కోసం నువ్వా.. నేనా.. అన్నట్లు మైదానంలో తలపడ్డారు. బ్యాటింగ్‌, బౌలింగ్‌ ప్రదర్శనలకు ఆర్ట్స్‌ కళాశాల మైదానం వేదికగా మారింది. జూనియర్‌ విభాగంలో మిర్యాలగూడ శ్రీశారద ప్రైవేటు ఐటీఐ కళాశాలకు చెందిన వంశీ 46 బంతుల్లో 8 ఫోర్లతో 58 పరుగులు, సీనియర్‌ విభాగంలో మంచిర్యాల వాగ్దేవి డిగ్రీ కళాశాలకు చెందిన సైఫ్‌అలీ 37 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులతో 52 పరుగులు చేసి ఆకట్టుకున్నారు. పోటీలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఏకశిల విద్యా సంస్థల ఛైర్మన్‌ గౌరు తిరుపతిరెడ్డి బ్యాటింగ్‌ చేసి పోటీలు ప్రారంభించారు.

జూనియర్‌ విభాగం
మిర్యాలగూడ శ్రీశారద ప్రైవేటు ఐటీఐ జట్టు గెలుపు
ప్రభుత్వ పాలిటెక్నిక్‌ నవీపేట్‌ నిజామాబాద్‌ జట్టుపై 49 పరుగులు తేడాతో మిర్యాలగూడ శ్రీశారద ప్రైవేటు ఐటీఐ జట్టు గెలుపొందింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీశారద జట్టు నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పొయి 106 పరగులు చేసింది. జట్టులో వంశీ 46 బంతుల్లో 8 ఫోర్లతో 58 పరుగులు, 2 వికెట్లు తీసి ఆల్‌రౌండర్‌ ప్రతిభను చాటగా రుషి, శంకర్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ప్రభుత్వ పాలిటెక్నిక్‌ జట్టు 12.5 ఓవర్లలో 10 వికెట్లు నష్టపోయి 57 పరుగులకే చేతులెత్తేసింది. జట్టులో ఎస్‌కేఅజర్‌ 19, శ్రీకాంత్‌ 15 పరుగులు చేశారు. వినోద్‌, సనాహుల్‌హక్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు.

వరంగల్‌ అర్బేన్‌ జూనియర్‌ కళాశాల జట్టు విజయం..
కాకతీయ జూనియర్‌ కళాశాల హుజురాబాద్‌, కరీంనగర్‌ జట్టుపై 6 పరుగుల తేడాతో వరంగల్‌ హన్మకొండలోని అర్బేన్‌ జూనియర్‌ కళాశాల జట్టు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అర్బేన్‌ జూనియర్‌ కళాశాల జట్టు నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 101 పరుగులు నమోదు చేసింది. జట్టులో సుకృత్‌ 42 పరుగులతో రాణించగా సాయినైనిత్‌ 19 పరుగులు చేశారు. బౌలింగ్‌లో రిషిక్‌ 2, కౌషల్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. కాకతీయ జూనియర్‌ కళాశాల జట్లు నిర్ణీత ఓవర్లు ఆడి 4 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. జట్టులో ఎండీఆదిల్‌ 33, సాయికృష్ణ 21 పరుగులు చేశారు. నితిన్‌ 2, హరికృష్ణ ఒక వికెట్‌ తీశారు.

రాణించిన మహబూబ్‌నగర్‌ ప్రతిభ జూనియర్‌ కళాశాల జట్టు
భద్రాద్రి కొత్తగూడెం (ఖమ్మం) రుద్రమ్‌పుర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌ జట్టుపై 6 వికెట్ల వ్యత్యాసంతో ప్రతిభ జూనియర్‌ కళాశాల మహబూబ్‌నగర్‌ జట్టు జయకేతనం ఎగురవేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ భద్రాద్రి కొత్తగూడం జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పొయి 83 పరుగులు చేసింది. జట్టులో వంశీ 24, వర్థన్‌ 17 పరుగులు చేశారు. కావ్య 2, భాను, వంశీ చెరో వికెట్‌ తీశారు. అనంతరం బరిలోకి దిగిన ప్రతిభ జూనియర్‌ కళాశాల మహబూబ్‌నగర్‌ జట్టు 11.0 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 87 పరుగులతో గెలుపొందింది. జట్టులో మొజీమ్‌ 34 పరుగులు, శివ 23 పరుగులు, 3 వికెట్లతో ప్రతిభ చాటాడు. మరో బౌలర్‌ రేహన్‌ 4 వికెట్లు పడగొట్డాడు.

సీనియర్‌ విభాగం
నల్గొండ స్వామిరామానంద తీర్థ ఇనిస్టిట్యూట్‌  ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ జట్టు జయకేతనం..
నిజామాబాద్‌ గిర్‌రాజ్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ జట్టుపై 6 వికెట్ల తేడాతో నల్గొండ స్వామిరామానంద తీర్థ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజజీ జట్టు విజయదుందుబి మోగించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన నిజామాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 100 పరుగులు చేసింది. జట్టులో పరశురామ్‌ 45 పరుగులు, దిలీప్‌ 14 పరగులు చేశారు. దిలీప్‌ 2, పరశురామ్‌, ప్రవీణ్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. బదులుగా నల్గొండ స్వామిరామానంద తీర్థ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ జట్టు 12 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయానికి అవసరమైన 101 పరుగులను చేసింది. జట్టులో భరత్‌ 32, షాబాజ్‌ 31 పరుగులు చేశారు. రఫీ, అజీబ్‌ చెరో వికెట్‌ కూల్చారు.

మెరిసిన మంచిర్యాల వాగ్దేవి డిగ్రీ కాలేజీ జట్టు..
ఎస్‌ఆర్‌, బీజీఎన్‌ఆర్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ ఖమ్మం జట్టుపై 48 పరుగుల తేడాతో మంచిర్యాల (ఆదిలాబాద్‌) వాగ్దేవి డిగ్రీ కాలేజీ జట్టు గెలుపొందింది. టాస్‌గెలిచి బ్యాటింగ్‌కు దిగిన వాగ్దేవి డిగ్రీ కాలేజీ జట్టు 14.3 ఓవర్లలో 10 వికెట్లు నష్టానికి 140 పరుగుల భారీ స్కోర్‌ నమోదు చేసింది. జట్టులో సైఫ్‌అలీ 52 పరుగులతో అర్ధ శతకం సాధించాడు. సాయి 26 పరుగులు చేయగా బౌలింగ్‌లో అజయ్‌, అరుణ్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ ఖమ్మం జట్టు 7 వికెట్లు కోల్పోయి 92 పరుగులు చేసింది. జట్టులో సాయి 23, ఠాగూర్‌ 19 పరుగులు చేశారు. సాయిప్రకాశ్‌ 4, హరీష్‌ 2 వికెట్లు తీశారు.

మహబూబ్‌నగర్‌ ఆదర్శ డిగ్రీ, పీజీ కాలేజీ జట్టు గెలుపు
శ్రీచైతన్య డిగ్రీ, పీజీ కాలేజీ గోదావరిఖని కరీంనగర్‌ జట్టుపై 9 వికెట్ల తేడాతో మహబూబ్‌నగర్‌ ఆదర్శ డిగ్రీ, పీజీ కాలేజీ జట్టు గెలుపొందింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ చేసిన శ్రీచైతన్య డిగ్రీ, పీజీ కాలేజీ జట్టు నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 76 పరుగులు చేసింది. జట్టులో సాయిప్రణీత్‌ 32 పరుగులు చేయగా జట్టు సభ్యులు రాణించలేదు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆదర్శ డిగ్రీ కాలేజీ జట్టు కేవలం 9.1 ఓవర్లలోనే వికెట్‌ నష్టపోయి 79 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో కేశవులు 48 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకంగా మారాడు. మహేష్‌ 17 పరుగులు చేయగా శ్రీకాంత్‌ 4 వికెట్లు తీసి రాణించాడు.

మరిన్ని

ఈరోజు మ్యాచ్‌లు

    ఉత్తరాంధ్ర
    సెంట్రల్‌ ఆంధ్ర
    గ్రేటర్‌
    తెలంగాణ
    రాయలసీమ

© 1995- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.