రాయలసీమ

రాయలసీమ రాకర్స్‌ కడప, అనంతపురం
మహిళా ఛాంపియన్‌ చిత్తూరు
ముగిసిన ఈసీసీ ప్రాంతీయస్థాయి పోటీలు
అనంతపురం క్రీడలు, న్యూస్‌టుడే: ఈసీసీ రాయలసీమ రాకర్స్‌గా కడప, అనంతపురం జిల్లాల జట్లు నిలిచాయి. సీనియర్స్‌ విభాగంలో కడప, జూనియర్స్‌ విభాగంలో అనంతపురం జిల్లా జట్లు విజయభేరి మోగించి ప్రాంతీయ ట్రోఫీలను సొంతం చేసుకున్నాయి. మహిళల విభాగంలో చిత్తూరు జట్టు రాయలసీమ ఛాంపియన్‌గా నిలిచింది. అనంతపురంలోని క్రీడా గ్రామం బి-మైదానంలో సీనియర్‌ విభాగంలో జరిగిన ఫైనల్‌ పోటీలో కడప బాలాజీ ఐటీ, మేనేజ్‌మెంటు కళాశాల జట్టు కర్నూలు బసిరెడ్డి డిగ్రీ కళాశాల జట్టును పది పరుగుల తేడాతో ఓడించింది. టాస్‌ గెలిచిన కడప జట్టు మొదట బ్యాటింగ్‌ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. ఈ జట్టులోని గురివిరెడ్డి (44; 4×4, 2×6), మదన్‌ (26) బ్యాటింగ్‌లో చెలరేగడంతో భారీస్కోరు నమోదు చేసింది. కర్నూలు బౌలర్లలో వీరేంద్ర (3 వికెట్లు), అరుణసాయి (2 వికెట్లు) ప్రత్యర్థి దూకుడుకు అడ్డుకట్ట వేశారు. అనంతరం 138 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ఆరంభించిన కర్నూలు జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 127 పరుగులే చేసి పరాజయం పాలైంది. మొదటి పది ఓవర్లలో పటిష్టస్థితిలో కనిపించిన కర్నూలు జట్టును బౌలరు సాయికుమార్‌ (5/21) దెబ్బతీశాడు. లోకేష్‌, మదన్‌ కూడా చెరో రెండు వికెట్లు కూల్చి ప్రత్యర్థి పతనాన్ని శాసించారు. కర్నూలు బ్యాట్స్‌మెన్లలో దేవేంద్ర (42) రాణించాడు. చివర్లో గిరినాథ్‌ (18) విజృంభించినా జట్టును గట్టెక్కించలేకపోయాడు. కడప జట్టు బౌలింగ్‌, ఫీల్డింగ్‌లో అసాధారణ ప్రతిభను ప్రదర్శించింది.
మౌలిక సదుపాయాలు కల్పించాలి
దేశ జనాభాలో 70 శాతం గ్రామీణ ప్రాంతాల్లోనే ఉంది. క్రీడలకు సంబంధించి మౌలిక సదుపాయాలు గ్రామాల్లో కల్పించాలని ఆర్డీటీ ఈడీ అన్నేఫెర్రర్‌ అభిప్రాయపడ్డారు. ఆర్డీటీ ద్వారా అనేక గ్రామాల్లో ఆటలకు సంబంధించి సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఈసీసీ ప్రాంతీయస్థాయి క్రికెట్‌ పోటీల ముగింపు కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గ్రామీణ ప్రాంతాల్లో చదివే బాలబాలికలను ఆటలవైపు దృష్టి మళ్లించాలంటే సదుపాయాల కల్పనే ప్రధానమన్నారు. అందుకే ఆర్డీటీ గ్రామీణ ప్రాంతాల యువతను ఆటల్లో ప్రోత్సహిస్తోందన్నారు. ఆర్డీటీ 50 ఏళ్లలో అనేక రంగాలను అభివృద్ధి చేసింది. బాలికల కోసం ప్రత్యేకంగా పథకాలు అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రాంతీయస్థాయిలో గెలిచిన జట్లను అభినందించారు. జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ కృష్ణయ్య మాట్లాడుతూ ఆటల్లో అద్భుతంగా రాణిస్తే సంపాదనతో పాటు సంతోషం కూడా సొంతమవుతుందన్నారు. గెలిచినా.. ఓడినా క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. ‘ఈనాడు’ యూనిట్‌ మేనేజరు కిశోర్‌ కుమార్‌ మాట్లాడుతూ విజేతలుగా నిలిచిన జట్లకు, ఓడిన జట్లకు పెద్ద తేడా లేదన్నారు. రాష్ట్రస్థాయిలో జరిగే ఈసీసీ పోటీల్లో గెలవడానికి మరింత కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌టీయూ ఉప ప్రిన్సిపల్‌ దేవకుమార్‌, ఆర్డీటీ డాక్టర్‌ సయ్యద్‌హుస్సేన్‌, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పోటీల్లో భాగంగా దాసరి శ్రీనివాస్‌ తన వ్యాఖ్యానంతో ఆకట్టుకున్నారు.
జూనియర్‌ విభాగంలో అనంత విజయం
విన్సెంట్‌ మైదానంలో జరిగిన జూనియర్‌ విభాగం ఫైనల్‌ పోటీలో అనంతపురం జిల్లా ఆత్మకూరు జట్టు కడప జట్టుపై ఏడు వికెట్ల తేడాతో అలవోకగా గెలిచింది. కడప జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసి 19.5 ఓవర్లలో 95 పరుగులకు ఆలౌటైంది. భవదీష్‌ (28) ఒంటరిపోరు కొనసాగించినా మూడంకెల స్కోరుకు చేర్చలేకపోయాడు. అనంతపురం బౌలరు పవన్‌ మూడు వికెట్లు పడగొట్టాడు. అనంతరం 96 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఆత్మకూరు జట్టు కేవలం 12.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఖాదర్‌ (37), జగదీశ్‌ (23) బ్యాటింగ్‌లో చెలరేగడంతో విజయం సొంతమైంది. కడప బౌలర్లపై అనంత బ్యాట్స్‌మెన్లు విరుచుకుపడ్డారు.
సూపర్‌ ఓవర్‌తో తేలిన ఫలితం
అనంతపురం, చిత్తూరు జట్లు నిర్ణీత 20 ఓవర్లలో సమానంగా 106 పరుగులు చేశాయి. మ్యాచ్‌ టై కావడంతో సూపర్‌ ఓవర్‌ ద్వారా ఫలితాన్ని తేల్చారు. సూపర్‌ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన అనంతపురం జట్టు కేవలం మూడు బంతులు ఆడి ఒకే ఒక్క పరుగు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ చేసిన చిత్తూరు జట్టు కూడా తొలి బంతికే వికెట్‌ చేజార్చుకుంది. రెండో బంతికి ఒక పరుగు, మూడో బంతికి మరో పరుగు చేయడంతో గెలుపు ఖరారైంది. హోరాహోరీ పోరులో సంచలన విజయం సాధించిన చిత్తూరు జట్టులో ఆనందం పరవళ్లు తొక్కింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన చిత్తూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 106 పరుగులు చేసింది. అనంతపురం జట్టు తర్వాత బ్యాటింగ్‌ చేసి 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 106 పరుగులే చేసింది. చివరి ఓవర్‌లో విజయానికి కేవలం మూడు పరుగులు చేయాల్సి ఉండగా మూడు పరుగులే చేసి టై చేసింది. ఈ మ్యాచ్‌ ఆద్యంతం రసవత్తరంగా జరిగింది. ముగింపు కార్యక్రమానికి ఆర్డీటీ ఈడీ అన్నేఫెర్రర్‌, జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ కృష్ణయ్య, ‘ఈనాడు’ అనంతపురం యూనిట్‌ మేనేజరు కిశోర్‌ కుమార్‌ హాజరై విజేతలకు ట్రోఫీలు, నగదు బహుమతులు, ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

ఈరోజు మ్యాచ్‌లు

    ఉత్తరాంధ్ర
    సెంట్రల్‌ ఆంధ్ర
    గ్రేటర్‌
    తెలంగాణ
    రాయలసీమ

© 1995- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.