ఉత్తరాంధ్ర

క్రీడాస్ఫూర్తే అసలైన విజయం
తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్‌ తిరుమలరావు
ముగిసిన రీజినల్‌ స్థాయి ‘ఈనాడు’ క్రికెట్ పోటీలు
రాజానగరం గ్రామీణం, న్యూస్‌టుడే: అత్యధిక జట్ల మధ్య క్రికెట్‌ పోటీలు నిర్వహించి గిన్నిస్‌బుక్‌లో నమోదవడం ఒక్క ‘ఈనాడు’ సంస్థకు మాత్రమే చెల్లుతుందని ‘ఈనాడు’ ఉత్తరాంధ్ర క్రికెట్‌ పోటీలు-2018 స్పాన్సర్‌, తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్‌ నున్న తిరుమలరావు పేర్కొన్నారు. ‘ఈనాడు’ ఆధ్వర్యంలో స్ప్రైట్‌ సమర్పించు ఈసీసీ(ఈనాడు ఛాంపియన్‌ క్రికెట్‌) కప్‌-2018 ఉత్తరాంధ్ర స్థాయి ఫైనల్‌ క్రికెట్‌ పోటీలు గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో ముగిశాయి. జూనియర్‌, సీనియర్‌ విభాగాల నుంచి నాలుగు జిల్లాల జట్లు తలపడ్డాయి.

* జూనియర్‌ విభాగం నుంచి లక్ష్మీదేవి గుప్తా కళాశాల(ధర్మపురి, విజయనగరం) జట్టు విజయం సాధించగా.. శాతవాహన జూనియర్‌ కళాశాల(హరిపురం, శ్రీకాకుళం) జట్టు రన్నర్‌గా నిలిచింది. తొలుత శాతవాహన జట్టు టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లక్ష్మీదేవిగుప్తా కళాశాల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 162 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన శాతవాహన జట్టు 14.1 ఓవర్లలో 70 పరుగుల సాధించి పూర్తి వికెట్లను కోల్పోయింది. లక్ష్మీదేవిగుప్తా కళాశాల క్రీడాకారులు కైనీష్‌ 5 వికెట్లను తీశాడు.

* సీనియర్‌ విభాగంలో డాక్టర్‌ లంకపల్లి బుల్లయ్య కళాశాల(విశాఖపట్నం) జట్టు విజయం సాధించగా, రన్నర్‌గా కైట్‌ 1 కళాశాల(కోరంగి, తూర్పుగోదావరి) జట్టు రన్నర్‌గా నిలిచింది. బుల్లయ్య కళాశాల జట్టు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుని నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 125 పరుగులు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌ బరిలో దిగిన కైట్‌ 1 కళాశాల జట్టు నిర్ణీత 20 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 96 పరుగులు మాత్రమే సాధించి ఓటమి చెందింది. ఇందులో బుల్లయ్య కళాశాల క్రీడాకారుడు పీఎస్‌ రాజు 5 వికెట్లు, కైట్‌ 1 జట్టు క్రీడాకారుడు ఖలీల్‌ 5 వికెట్లు తీశాడు.

బహుమతి ప్రదానోత్సవం
అనంతరం తూర్పుగోదావరి జిల్లా ‘ఈనాడు’ యూనిట్‌ ఇన్‌ఛార్జి ఎ.వెంకటేశ్వరరావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ముగింపు కార్యక్రమంలో తిరుమలరావు పాల్గొని క్రీడాకారులనుద్దేశించి మాట్లాడుతూ గెలుపోటములకు సంబంధించి ప్రస్తుత రోజుల్లో మనిషి బతికి ఉండటమే ఒక విజయమైతే, ఆట ఆడడం మరో విజయంగా క్రీడాకారులు భావించాలన్నారు. గెలిచిన వారైన ఓటమి చెందిన వారైనా సనిహితంగా మెలగి క్రీడా స్ఫూర్తిని చాటాలన్నారు. ఈ పోటీల్లో పాల్గోన్న క్రీడాకారులు భవిష్యత్తులో జాతీయ స్థాయిలో ఆడి దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. జీఎస్‌ఎల్‌ సంస్థల చీఫ్‌ మెంటార్‌ డాక్టర్‌ గన్ని భాస్కరరావు మాట్లాడుతూ వయసుకు తగ్గట్టుగా ప్రతి ఒక్కరూ ఆయా క్రీడలను ఎంపిక చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. అనంతరం చైతన్య విద్యా సంస్థల అధినేత కేవీవీ సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ‘ఈనాడు’ క్రీడాకారులకు క్రికెట్‌ పోటీల ద్వారా అందిస్తున్న ప్రోత్సాహం అభినందనీయమన్నారు. రాజమహేంద్రవరం ‘ఈనాడు’ యూనిట్‌ ఇన్‌ఛార్జి ఎ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో ఉత్తరాంధ్ర స్థాయి క్రికెట్‌ పోటీలను విజయవంతం చేసిన స్పాన్సర్‌ తిరుమల విద్యాసంస్థలకు, మైదానాలను ఏర్పాటు చేసిన జీఎస్‌ఎల్‌, గైట్‌ కళాశాలల యాజమాన్యాలకు, పోటీల్లో పాల్గొన్న కళాశాలల యాజమాన్యాలకు, క్రీడాకారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఉత్తరాంధ్ర స్థాయి జట్లు తిరుపతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం క్రికెట్‌ అసోసియేషన్‌ జోనల్‌ ఇన్‌ఛార్జి బి.చిన్ని, జీఎస్‌ఎల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సాధిక, డాక్టర్‌ తరుణ్‌ క్రీడాకారులను అభినందించి భవిష్యత్తు క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. అనంతరం విన్నర్‌, రన్నర్‌లుగా ఎంపికైన క్రీడాకారులకు ట్రోఫీలను, నగదు బహుమతులను అందజేశారు. అంపైర్‌లుగా బి.చిన్ని, ఫణి స్కోరర్‌గా అచ్యుతరావు, పంకజ్‌కుమార్‌ యాదవ్‌ వ్యవహరించారు.

ఈరోజు మ్యాచ్‌లు

    ఉత్తరాంధ్ర
    సెంట్రల్‌ ఆంధ్ర
    గ్రేటర్‌
    తెలంగాణ
    రాయలసీమ

© 1995- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.