ప్రధానాంశాలు

ముగిసిన ఈసీసీ కప్‌-2018 సంబురం
సీనియర్ల విజేత నల్గొండ స్వామిరామానందతీర్థ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ జట్టు
జూనియర్ల విజేత మిర్యాలగూడ శ్రీశారద ప్రైవేటు ఐటీఐ కాలేజీ జట్టు
విజేతలకు ట్రోఫీలు, బహుమతులు అందించిన నిట్‌ వరంగల్‌ డైరెక్టర్‌ రమణారావు
వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: ‘ఈనాడు’ గ్రూప్‌ సంస్థల ఆధ్వర్యంలో తెలంగాణ జిల్లాల్లోని ప్రతిభగల యువ క్రికెటర్లను వెలికతీయడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ‘ఈనాడు క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌-2018’ బాలుర ప్రాంతీయ స్థాయి పోటీలు శుక్రవారంతో ముగిశాయి. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల క్రీడా మైదానంలో మూడు రోజల పాటు నిర్వహించిన మ్యాచ్‌ల్లో క్రికెటర్లు ఆకాశమే హద్దుగా బ్యాటింగ్‌, బౌలింగ్‌ విన్యాసాలతో దుమ్ములేపారు. ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జూనియర్‌, డిగ్రీ కళాశాలలకు చెందిన సీనియర్‌, జూనియర్‌ విభాగాల్లోని 14 జట్లు ప్రాంతీయ స్థాయి టోర్నీలో పాల్గొన్నాయి. యువ క్రికెటర్లు తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ గెలుపు కోసం హోరాహోరీగా పోరాడారు. సీనియర్ల ఫైనల్‌ పోటీలో నల్గొండ స్వామిరామానందతీర్థ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌, టెక్నాలజీ జట్టు, జూనియర్లలో మిర్యాలగూడ శ్రీశారద ప్రైవేటు ఐటీఐ కాలేజీ జట్టు విజేతలుగా నిలిచాయి. నువ్వా.. నేనా అన్నట్లుగా సాగిన పోరులో ఆల్‌రౌండర్‌ ప్రతిభను చాటారు.

‘ఈనాడు’ వరంగల్‌ యూనిట్‌ ఇన్‌ఛార్జి కేఎస్‌పీ రాజు అధ్యక్షతన ఏర్పాటుచేసిన ముగింపు వేడుకలకు ముఖ్యఅతిథిగా హాజరైన జాతీయ సాంకేతిక సంస్థ (నిట్‌) వరంగల్‌ డైరెక్టర్‌ రమణారావు విజేత జట్టుతో పాటు ద్వితీయ స్థానంలో నిలిచిన జట్టుకు ట్రోఫీలు అందించారు. ఈ సందర్భంగా రమణారావు మాట్లాడుతూ ‘ఈటీవీ’ పాటల పోటీల్లో అద్భుతమైన ప్రతిభగల గాయినీ, గాయకులు చాలామంది వెలుగులోకి వచ్చినట్లే క్రికెట్‌ క్రీడలోనూ దేశం గర్వించదగ్గ యువ క్రీడాకారులను ఈనాడు తయారు చేస్తోందని కొనియాడారు. యువకులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని లక్ష్యంవైపు దూసుకుపోవాలని కోరారు. ఏకశిల విద్యా సంస్థల ఛైర్మన్‌ గౌరు తిరుపతిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో యువ ప్రతిభను గుర్తిస్తూ వారిని ప్రోత్సహిస్తున్న ఈనాడు స్ఫూర్తితో రాష్ట్రస్థాయి పోటీల్లోనూ జయకేతనం ఎగురవేయాలని కోరారు. సుధాకర్‌ పైప్స్‌, ఫిట్టింగ్స్‌ మార్కెటింగ్‌ మేనేజర్‌ మధుమోహన్‌ విజేతలకు శుభాకాంక్షలు తెలిపారు. మ్యాచ్‌లకు అంపైర్లుగా బండారి ప్రభాకర్‌, మట్టెడ కుమార్‌, మజర్‌, దీపక్‌, శేఖర్‌, స్కోరర్లుగా క్రాంతి, అభినవ్‌ వ్యవహరించారు.

సీనియర్లలో ప్రతిభను చాటిన నల్గొండ జట్టు..
సీనియర్ల ఫైనల్‌ మ్యాచ్‌లో మంచిర్యాల వాగ్దేవి డిగ్రీ కాలేజీ జట్టుపై 5 వికెట్ల తేడాతో నల్గొండ స్వామిరామానందతీర్థ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ జట్టు ఘన విజయం సాధించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న మంచిర్యాల వాగ్దేవి డిగ్రీ కాలేజీ జట్టు 17.4 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 113 పరుగులకు కుప్పకూలింది. జట్టులో సాయిరామ్‌ 29, అరుణ్‌ 27 పరుగులు చేశారు. బౌలింగ్‌లో అజయ్‌ 2, సాయిరామ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. లక్ష్య సాధనకు బరిలోకి దిగిన స్వామిరామానందతీర్థ ఇంజనీరింగ్‌ కాలేజీ జట్టు కేవలం 14.5 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి విజయానికి అవసరమైన 114 పరుగులను అందుకుని విజేతగా నిలిచింది. జట్టులో శభాజ్‌ 48, భరత్‌ 20 పరుగులతో రాణించారు. బౌలింగ్‌లో రఫీ 3, అఖీబ్‌, భరత్‌ చెరో 2 వికెట్ల చొప్పున పడగొట్టి జట్టు విజయంలో కీలకంగా మారారు.

జూనియర్లలో మిర్యాలగూడ జయకేతనం..
మంచిర్యాల ఎస్‌ఆర్‌ఆర్‌ జూనియర్‌ కాలేజీ జట్టుపై 70 పరుగుల ఆధిక్యంతో మిర్యాలగూడ శ్రీశారద ప్రైవేటు ఐటీఐ కాలేజీ జట్టు భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన శ్రీశారద ఐటీఐ కాలేజీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 152 పరుగులను ప్రత్యర్థి జట్టు ముందుంచింది. జట్టులో లింగరాజు 43, ఆర్‌.వంశీ 25, ఆర్‌.శంకర్‌ 18 పరుగులతో రాణించారు. ఎం.శంకర్‌, వంశీ, ప్రైస్‌ చెరో 2 వికట్లు పడగొట్టారు. బదులుగా మంచిర్యాల ఎస్‌ఆర్‌ఆర్‌ జూనియర్‌ కాలేజీ జట్టు 18.3 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 82 పరుగులకే చేతులెత్తేసింది. జట్టులో ఇస్మాయిల్‌ 14, సాయికృష్ణ 13 పరుగులు చేయగా ఇస్మాయిల్‌ 3, సాయికృష్ణ 2 వికెట్లు పడగొట్టారు. ఎస్‌ఆర్‌ఆర్‌ జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు.

మరిన్ని

ఈరోజు మ్యాచ్‌లు

    ఉత్తరాంధ్ర
    సెంట్రల్‌ ఆంధ్ర
    గ్రేటర్‌
    తెలంగాణ
    రాయలసీమ

© 1995- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.