ప్రధానాంశాలు

ముగింపు అదరహో!
ఉత్కంఠగా సాగిన ఈసీసీ సెంట్రల్‌ ఆంధ్ర ఫైనల్స్‌
మహిళా విభాగంలో పశ్చిమ గోదావరి హవా
పురుషుల సీనియర్స్‌లో గుంటూరు... జూనియర్స్‌లో కృష్ణా జట్ల గెలుపు
చీరాల అర్బన్‌, న్యూస్‌టుడే: ఉత్కంఠ భరిత పోరు ముగిసింది. విజేతలు గెలుపు సంబరాల్లో మునిగిపోయారు. ఔత్సాహిక క్రీడాకారుల కేరింతలతో మైదానం అంతటా సందడి నెలకొంది. ‘ఈనాడు ఈతరం క్లబ్‌’ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాలలో నిర్వహిస్తున్న ‘ఈసీసీ కప్‌-2018’ సెంట్రల్‌ ఆంధ్రా ప్రాంతీయ స్థాయి క్రికెట్‌ పోటీలు గురువారంతో వేడుకగా ముగిశాయి. మహిళా విభాగంలో పశ్చిమ గోదావరి (క్రికెట్‌ అసోషియేషన్‌); పురుషుల సీనియర్స్‌ విభాగంలో గుంటూరు (విజ్ఞాన్‌ యూనివర్సిటీ); జూనియర్స్‌లో కృష్ణా (ఎస్పీ సిద్ధార్థ) విజేతలుగా నిలిచాయి. సెయింట్‌ ఆన్స్‌ ఇంజినీరింగ్‌, బండ్ల బాపయ్య హిందూ డిగ్రీ కళాశాలల మైదానాలు పోటీలకు వేదికగా నిలిచాయి. సెయింట్‌ ఆన్స్‌లో సాయంత్రం నిర్వహించిన బహుమతి ప్రదానోత్సవ సభకు అదనపు ఎస్పీ లావణ్య లక్ష్మి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రస్తుత విద్యా వ్యవస్థ ఎంతో ఒత్తిడితో కూడకున్నదని... దాని నుంచి ఉపశమనం పొందేందుకు ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ‘ఈనాడు’ ఒంగోలు యూనిట్‌ ఇన్‌ఛార్జి బి.శ్రీనివాస్‌ మాట్లాడుతూ... మంచి వాతావరణంలో పోటీల నిర్వహణకు సహకరించిన కళాశాలల యాజమాన్యాలు, క్రీడాకారులకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈనాడు’ సీనియర్‌ మేనేజర్‌ (ఈవెంట్స్‌) సాధన బసంగార్‌ మాట్లాడుతూ... ప్రాంతీయ పోటీల విజేతలు తిరుపతిలో ఈ నెల 17 నుంచి జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. అనంతరం విన్నర్‌, రన్నర్‌ జట్లకు అతిథుల చేతులమీదుగా ట్రోఫీలు అందజేశారు.
పశ్చిమ గోదావరి భారీ విజయం...
సెయింట్‌ ఆన్స్‌ కళాశాల మైదానంలో ఉదయం జరిగిన మహిళల ఫైనల్స్‌లో పశ్చిమ గోదావరి (క్రికెట్‌ అసోషియేషన్‌), గుంటూరు (విజ్ఞాన్‌ యూనివర్సిటీ) జట్లు తలపడ్డాయి. టాస్‌ గెలిచిన పశ్చిమ గోదావరి జట్టు బ్యాటింగ్‌ ఎంచుకొని నిర్ణీత ఓవర్లలో కేవలం ఒక వికెట్‌ మాత్రమే కోల్పోయి 216 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం బరిలోకి దిగిన గుంటూరు జట్టు ఏడు వికెట్ల నష్టానికి 28 పరుగులు మాత్రమే చేసి ఓటమి పాలయ్యింది. విజేత జట్టులో లావణ్య 41 బంతుల్లో 71 పరుగులు (పది ఫోర్లు), సత్యవేణి 25 బంతుల్లో 49 పరుగులు (ఏడు ఫోర్లు) చేసి జట్టు భారీ స్కోరు సాధించడంలో భాగస్వాములయ్యారు. గుంటూరు జట్టు ఓటమి పాలైనా... తుదివరకు వికెట్లు కాపాడుకున్న తీరు ఆకట్టుకుంది.

జూనియర్స్‌లో కృష్ణా జయభేరి...
బీబీహెచ్‌ మైదానంలో ఉదయం జరిగిన జూనియర్స్‌ ఫైనల్స్‌లో కృష్ణా (ఎస్పీ సిద్ధార్థ), గుంటూరు (జేకేసీ) పోటీ పడ్డాయి. టాస్‌ గెలిచిన గుంటూరు బౌలింగ్‌ ఎంచుకొంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన కృష్ణా జట్టు నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 131 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన గుంటూరు జట్టు 74 పరుగులకే కుప్పకూలి... ఓటమి మూటకట్టుకుంది. కృష్ణా జట్టులో కృష్ణసాయి 60 బంతుల్లో 50 పరుగులు (ఆరు ఫోర్లు, ఒక సిక్స్‌) చేశారు. బౌలర్లు చక్రి, ధనుష్‌ చేరో నాలుగు వికెట్లు చేజిక్కించుకొని జట్టు విజయానికి బాటలు వేశారు.

సీనియర్స్‌ విజేత గుంటూరు...
మధ్యాహ్నం సెయింట్‌ ఆన్స్‌ మైదానంలో జరిగిన పురుషుల సీనియర్స్‌ ఫైనల్‌ పోరులో గుంటూరు (విజ్ఞాన్‌ యూనివర్సిటీ), నెల్లూరు (కృష్ణ చైతన్య డిగ్రీ, పీజీ కళాశాల) జట్లు తలపడ్డాయి. మ్యాచ్‌ ఆద్యంతం ఉత్కంఠగా సాగింది. టాస్‌ గెలిచిన గుంటూరు జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగి... ఏడు వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు చివరి వరకు పోరాడి... తొమ్మిది వికెట్ల నష్టానికి 113 పరుగులు మాత్రమే చేసి ఓటమి చవిచూసింది. విజేత జట్టులో అఖిల్‌ 29 బంతుల్లో 31 పరుగులు (అయిదు ఫోర్లు), సాగర్‌ 23 బంతుల్లో 25 పరుగులు (మూడు ఫోర్లు) చేసి జట్టు గెలుపులో కీలకంగా వ్యవహరిచారు.

మరిన్ని

ఈరోజు మ్యాచ్‌లు

    ఉత్తరాంధ్ర
    సెంట్రల్‌ ఆంధ్ర
    గ్రేటర్‌
    తెలంగాణ
    రాయలసీమ

© 1995- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.