ప్రధానాంశాలు

దూసుకెళ్లారు!
విజయమే లక్ష్యంగా పోరాడిన క్రికెటర్లు
సెంచరీతో కదం తొక్కిన మంచిర్యాల ఎస్‌ఆర్‌ఆర్‌ జట్టు కెప్టెన్‌ సాయికృష్ణ
తుది దశకు చేరుకున్న ఈనాడు క్రికెట్‌  ఛాంపియన్‌షిప్‌-2018 ప్రాంతీయ స్థాయి పోటీలు
వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: ‘ఈనాడు’ క్రికెట్‌ ఛాంపియన్‌షిప్‌ బాలుర ప్రాంతీయ స్థాయి పోటీల్లో యువ క్రికెటర్లు విజయమే లక్ష్యంగా దూసుకెళ్లారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలోని కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాల మైదానంలో జూనియర్‌, సీనియర్‌ జట్లు గురువారం హోరాహోరీగా తలపడ్డాయి. సెమీస్‌ పోరులో బ్యాట్స్‌మెన్లు, బౌలర్లు తమ అత్యుత్తమ ప్రదర్శనతో చెలరేగిపోయారు. జూనియర్స్‌ విభాగంలో మంచిర్యాల ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ జట్టు కెప్టెన్‌ సాయికృష్ణ తన బ్యాటింగ్‌ విన్యాసంతో ప్రత్యర్థి జట్టుకు చుక్కలు చూపించాడు. మహబూబ్‌నగర్‌ ప్రతిభ జూనియర్‌ కాలేజీ జట్టుతో జరిగిన సెమీస్‌లో సాయికృష్ణ 71 బంతుల్లో 17 ఫోర్లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఈ సీజన్‌లో అత్యధిక వ్యక్తిగత, జట్టు స్కోర్‌ మంచిర్యాల ఎస్‌ఆర్‌ఆర్‌ జూనియర్‌ కాలేజీ నమోదు చేయడం విశేషం. సెమీస్‌ పోటీలను వరంగల్‌ క్రికెట్‌ సంఘం కార్యదర్శి చాగంటి శ్రీనివాస్‌, మాజీ కార్యదర్శి ఉదయభానురావు వీక్షించి క్రీడాకారులకు పలు సూచనలు చేశారు. మైదానంలో క్రీడాకారులకు ప్రథమ చికిత్స, అత్యవసర సదుపాయం నిమిత్తం వరంగల్‌ రోహిణి మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి యాజమాన్యం అంబులెన్స్‌ను అందుబాటులో ఉంచింది.

జూనియర్‌ విభాగం
మిర్యాలగూడ ‘శ్రీశారద’ జయకేతనం
సెమీస్‌ మ్యాచ్‌లో హన్మకొండ అర్బేన్‌ జూనియర్‌ కాలేజీ జట్టుపై 5 వికెట్ల తేడాతో మిర్యాలగూడ శ్రీ శారద ప్రైవేటు ఐటీఐ కాలేజీ జట్టు జయకేతనం ఎగుర వేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న అర్బేన్‌ జూ.కాలేజీ జట్టు 12.4 ఓవర్లలో 69 పరుగులకే కుప్పకూలింది. జట్టులో సాకేత్‌ 21, సాయినైనీత్‌ 16 పరుగులు చేశారు. బౌలింగ్‌లో సాకేత్‌ 3, సాయినైనీత్‌, రిషిక్‌ చెరో వికెట్‌ పడగొట్టారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన శ్రీశారద జట్టు 12.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టంతో 70 పరుగులను సాధించి ఫైనల్స్‌కు చేరింది. జట్టులో వంశీ 22, శంకర్‌ 20 పరుగులు చేయగా, బౌలింగ్‌లో లింగరాజు 3, శంకర్‌, ఎం. శంకర్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

అదరగొట్టిన మంచిర్యాల ‘ఎస్‌ఆర్‌ఆర్‌’ జట్టు
మరో సెమీస్‌ పోరులో మహబూబ్‌నగర్‌ ప్రతిభ జూనియర్‌ కాలేజీ జట్టుపై 75 పరుగుల తేడాతో మంచిర్యాల ఎస్‌ఆర్‌ఆర్‌ జూనియర్‌ కాలేజీ జట్టు ఘన విజయాన్ని అందుకుంది. కెప్టెన్‌ సాయికృష్ణ తన బ్యాటింగ్‌తో పరుగుల వరద సృష్టించాడు. టాస్‌గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఎస్‌ఆర్‌ఆర్‌ జూ.కాలేజీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో వికెట్‌ నష్టంతో 178 పరుగుల భారీ స్కోర్‌ను నమోదు చేసింది. ఓపెనింగ్‌కు దిగిన సాయికృష్ణ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు.కేవలం 71 బంతులు ఆడిన సాయికృష్ణ 17 ఫోర్లతో 105 పరుగులు చేశాడు. మరో బ్యాట్స్‌మెన్‌ ఇస్మాయిల్‌ 48 పరుగులతో రాణించి అజేయంగా నిలిచారు. ఛేదనకు దిగిన మహబూబ్‌నగర్‌ ప్రతిభ జూనియర్‌ కాలేజీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టంతో 103 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో శివ 43, జిషాన్‌ 16 పరుగులు చేశారు.

సీనియర్‌ విభాగం
ఉత్కంఠ పోరులో మంచిర్యాల ‘వాగ్దేవి’ జట్టు విజయం
నువ్వా నేనా అంటూ సాగిన సీనియర్‌ సెమీస్‌ పోరులో మహబూబ్‌నగర్‌ ఆదర్శ డిగ్రీ, పీజీ కాలేజీ జట్టుపై 4 పరుగుల తేడాతో మంచిర్యాల వాగ్దేవి డిగ్రీ కాలేజీ జట్టు గెలుపొందింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వాగ్దేవి డిగ్రీ కాలేజీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టంతో 108 పరుగులు చేసింది. జట్టులో సైఫ్‌ అలి 21, సాయి 22, ఇమామ్‌ 13 పరుగులు చేశారు. బౌలింగ్‌లో అజయ్‌, అరుణ్‌ 3చొప్పున, భువన్‌ 2 వికెట్లతో రాణించారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఆదర్శ డిగ్రీ, పీజీ కాలేజీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 104 పరుగులు మాత్రమే చేసింది. జట్టులో శ్రీకాంత్‌ 24, హర్షవర్ధన్‌ 22, శ్రీను 12 పరుగులు చేశారు. శ్రీకాంత్‌ 2, హరిబాబు, మహేష్‌  చెరో వికెట్‌ పడగొట్టారు.

హోరాహోరీలో నల్గొండ ‘స్వామి రామానందతీర్థ’ విజయదుందుబి
హోరాహోరీగా సాగిన రెండో సీనియర్‌ సెమీస్‌లో వరంగల్‌ మాస్టర్‌జీ డిగ్రీ, పీజీ కాలేజీ జట్టుపై 2 వికెట్ల తేడాతో నల్గొండ స్వామి రామానంద తీర్థ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ జట్టు విజయదుందుభి మోగించింది. టాస్‌ గెలిచిన మాస్టర్‌జీ డిగ్రీ, పీజీ కాలేజీ జట్టు తొలుత బ్యాటింగ్‌ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 108 పరుగులు చేసింది. జట్టులో వంశీ, ఇబ్రహీం చేరి 28 పరుగులు చేశారు. బౌలింగ్‌లో శ్రావణ్‌, నవీన్‌ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనకు దిగిన స్వామిరామానంద తీర్థ ఇంజినీరింగ్‌ జట్టు 19.2 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 111 పరుగులు చేసింది. జట్టులో అబర్‌ఖాన్‌ 46 పరుగులతో ఆకట్టుకున్నాడు. అఖీబ్‌ 13 పరుగులు చేశారు. బౌలింగ్‌లో శాబాజ్‌ 3, భరత్‌ 2 వికెట్లు పడగొట్టారు. చివరి ఓవర్‌లో విజయానికి 4 పరుగులు కావాల్సి ఉండగా బ్యాట్స్‌మెన్‌ ఒక బంతికి 2, మరో బంతికి 4 కొట్టి  విజయాన్ని అందించారు.

మరిన్ని

ఈరోజు మ్యాచ్‌లు

    ఉత్తరాంధ్ర
    సెంట్రల్‌ ఆంధ్ర
    గ్రేటర్‌
    తెలంగాణ
    రాయలసీమ

© 1995- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.