గ్రేటర్‌

ప్రాంతీయ విజేత ఎంఎల్‌ఆర్‌ఐటీ
భవన్స్‌కు జూనియర్స్‌ టైటిల్‌
అమ్మాయిల ఛాంప్‌ ఖాజా సీఏ
ఈసీసీ కప్‌
ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: స్ప్రైట్‌ ఈసీసీ కప్‌- 2018 హైదరాబాద్‌ ప్రాంతీయ టోర్నీ సీనియర్స్‌ విభాగంలో మర్రి లక్ష్మారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఎల్‌ఆర్‌ఐటీ) ఛాంపియన్‌గా నిలిచింది. టోర్నీ ఆరంభం నుంచి అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌ చేరిన ఆ జట్టు టైటిల్‌ ఎగరేసుకు పోయింది. శనివారం ఫీర్జాదిగూడలోని బాబురావు సాగర్‌-బి మైదానంలో జరిగిన తుది పోరులో ఎంఎల్‌ఆర్‌ఐటీ 59 పరుగుల తేడాతో సర్దార్‌ పటేల్‌ డిగ్రీ కళాశాలపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన ఎంఎల్‌ఆర్‌ఐటీ 15 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. సందీప్‌ (51 నాటౌట్‌; 24 బంతుల్లో 5×4, 3×6) అజేయ అర్ధశతకంతో చెలరేగాడు. వికాస్‌ (33), జయసూర్య (28 నాటౌట్‌) కీలక పరుగులు చేశారు. అనంతరం ఛేదనలో సర్దార్‌ పటేల్‌ కళాశాల 15 ఓవర్లలో 7 వికెట్లకు 103 పరుగులే చేయగలిగింది. భారీ లక్ష్యఛేదనలో ఆ జట్టు వేగంగా ఆడలేకపోయింది. ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. జైదేవ్‌ గౌడ్‌ (24), హర్షవర్ధన్‌ (22) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోరు చేశారు. బ్యాటింగ్‌లో రాణించిన జయసూర్య (2/16) బౌలింగ్‌లోనూ రెండు వికెట్లతో మెరిశాడు.

జూనియర్స్‌ విజేత భవన్స్‌: జూనియర్స్‌ విభాగంలో భవన్స్‌ శ్రీ అరబిందో జూనియర్‌ కళాశాల ట్రోఫీ సొంతం చేసుకుంది. ఫైనల్లో భవన్స్‌ 76 పరుగుల తేడాతో గౌతమ్‌ జూనియర్‌ కళాశాలను చిత్తుచేసింది. టాస్‌ గెలిచి ముందు బ్యాటింగ్‌ చేసిన భవన్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసింది. హిమాన్షు (32 నాటౌట్‌), ప్రణయ్‌ కుమార్‌ (23) రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో చిరంజీవి (2/28) ఆకట్టుకున్నాడు. బదులుగా బ్యాటింగ్‌కు దిగిన గౌతమ్‌ జూనియర్‌ కళాశాల.. ఇషాన్‌ (4/9) ధాటికి 16.3 ఓవర్లలో 82 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో అభినవ్‌ (16) టాప్‌స్కోరర్‌. ఇషాన్‌తో పాటు భరత్‌ (2/18) సత్తాచాటి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.

ఖాజా అకాడమీ జోరు: మహిళల విభాగంలో ఎస్కే ఖాజా క్రికెట్‌ అకాడమీ సత్తాచాటింది. కల్పన (32, 4/4) ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో చెలరేగడంతో తుదిపోరులో ఖాజా అకాడమీ 118 పరుగుల తేడాతో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌జేసీ బాలికల కమ్మదనం అకాడమీ (షాద్‌నగర్‌)పై ఘన విజయం సాధించి విజేతగా నిలిచింది. టాస్‌ నెగ్గి మొదట బ్యాటింగ్‌ చేసిన ఖాజా అకాడమీ 15 ఓవర్లలో 4 వికెట్లకు 156 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో చందన (43), కల్పన, సుక్రిత రాణించారు. ప్రత్యర్థి బౌలర్లలో నిఖిత (2/22) రెండు వికెట్లు తీసింది. ఛేదనలో టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌జేసీ 10.2 ఓవర్లలో 38 పరుగులకే కుప్పకూలింది. ఆ జట్టులో రజని (15) టాప్‌ స్కోరర్‌. కల్పనతో పాటు కావ్య శ్రీ (2/14) విజృంభించి ప్రత్యర్థి పతనాన్ని శాసించారు.

ఫిట్‌నెస్‌ ముఖ్యం: క్రికెట్‌లో ఉన్నతస్థానానికి చేరాలంటే ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యమని హైదరాబాద్‌ రంజీ క్రికెటర్‌ టి.రవితేజ అన్నాడు. స్ప్రైట్‌ ఈసీసీ కప్‌- 2018 హైదరాబాద్‌ ప్రాంతీయ టోర్నీ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవితేజ విజేతలకు బహుమతులు అందజేశాడు. ‘‘యువ క్రికెటర్ల నైపుణ్యాన్ని వెలుగులోకి తీసుకువచ్చేందుకు ‘‘ఈనాడు’’ చేస్తున్న ఈ ప్రయత్నం అభినందనీయం. 2015 ఈసీసీ కప్‌లో నేను ఆడా. ఆ ఏడాది మా జట్టు సర్దార్‌ పటేల్‌ కళాశాల విజేతగా నిలిచింది.  ప్రస్తుతం క్రికెట్లో రాణించాలంటే ఫిట్‌నెస్‌ చాలా ముఖ్యం’’ అని పేర్కొన్నాడు. ఈ ప్రాంతీయ టోర్నీలో విజేతలుగా నిలిచిన జట్లు హైదరాబాద్‌ హీరోస్‌ తరపున రాష్ట్ర స్థాయి లీగ్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయని ఈనాడు సీనియర్‌ ఈవెంట్స్‌ మేనేజర్‌ సాధన తెలిపారు. రాష్ట్ర స్థాయిలో నార్త్‌ ఆంధ్ర నింజాస్‌, సెంట్రల్‌ ఆంధ్ర ఛాలెంజర్స్‌, రాయలసీమ రాకర్స్‌, తెలంగాణ టైగర్స్‌, హైదరాబాద్‌ హీరోస్‌ తలపడనున్నాయి. తిరుపతి, హైదరాబాద్‌లో ఈ లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

సీనియర్స్‌:
ఎంఎల్‌ఆర్‌ఐటీ: 162/4 (సందీప్‌ 51 నాటౌట్‌, జయసూర్య 28 నాటౌట్‌, వికాస్‌ 33, జైదేవ్‌ 1/18), సర్దార్‌ పటేల్‌ డిగ్రీ కళాశాల: 103/7 (జైదేవ్‌ గౌడ్‌ 24, హర్షవర్ధన్‌ 22, జయసూర్య 2/16);

జూనియర్స్‌:
భవన్స్‌ శ్రీ అరబిందో జూనియర్‌ కళాశాల: 158/6 (హిమాన్షు 32 నాటౌట్‌, ప్రణయ్‌ కుమార్‌ 23, ఇలియాన్‌ 29, చిరంజీవి 2/28), గౌతమ్‌ జూనియర్‌ కళాశాల: 82 (వినయ్‌ 15, అభినవ్‌ 16, ఇషాన్‌ 4/9, భరత్‌ 2/18);

మహిళలు:
ఎస్కే ఖాజా క్రికెట్‌ అకాడమీ: 156/4 (చందన 43, కల్పన 32, సుక్రిత 22, నిఖిత 2/22, శ్వేత 1/10), టీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్‌జేసీ: 38 (రజిని 15, కల్పన 4/4, కావ్య శ్రీ 2/14)

ఈరోజు మ్యాచ్‌లు

    ఉత్తరాంధ్ర
    సెంట్రల్‌ ఆంధ్ర
    గ్రేటర్‌
    తెలంగాణ
    రాయలసీమ

© 1995- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.