సెంట్రల్‌ ఆంధ్ర

పరుగుల వరద
ముందు బ్యాటింగ్‌ చేసిన జట్లదే విజయం
నేడు అన్ని విభాగాల్లో ఫైనల్స్‌
ఆసక్తికరంగా ఈసీసీ ప్రాంతీయ క్రికెట్‌ పోటీలు
చీరాల అర్బన్‌, న్యూస్‌టుడే: బ్యాట్స్‌మెన్‌ హవా సాగింది. పరుగుల వరద పారింది. బుధవారం ఆయా విభాగాల్లో జరిగిన మూడు సెమీఫైనల్‌ మ్యాచ్‌ల్లోనూ ముందు బ్యాటింగ్‌కు దిగిన జట్లనే విజయలక్ష్మి వరించింది. ‘ఈనాడు ఈతరం క్లబ్‌’ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా చీరాలలో నిర్వహిస్తున్న ఈసీసీ-2018 సెంట్రల్‌ ఆంధ్రా ప్రాంతీయ క్రికెట్‌ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. సెమీస్‌ కావడంతో అన్ని జట్లు విజయం కోసం హోరాహోరీగా తలపడ్డాయి. బీబీహెచ్‌ మైదానంలో గుంటూరు, పశ్చిమ గోదావరి జూనియర్‌ జట్ల మధ్య మ్యాచ్‌ను ఆ కళాశాల కరస్పాండెంట్‌ బండ్ల శరత్‌బాబు ప్రారంభించారు. మధ్యాహ్నం... నెల్లూరు, కృష్ణా సీనియర్ల జట్ల మధ్య పోటీని శాప్‌ ఛైర్మన్‌ అంకమ్మ చౌదరి ప్రారంభించారు. ముందుగా క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. సెయింట్‌ ఆన్స్‌ మైదానంలో నిర్వహించిన నెల్లూరు, పశ్చిమ గోదావరి మహిళా జట్ల మధ్య పోరు ప్రత్యేకంగా నిలిచింది. ఈ ప్రాంతంలో తొలిసారిగా మహిళా జట్ల మధ్య మ్యాచ్‌ జరగడంతో... తిలకించేందుకు పెద్ద ఎత్తున విద్యార్థినులు తరలివచ్చారు. ఆద్యంతం చప్పట్లతో క్రీడాకారిణులను ఉత్సాహపరిచారు. ఈ మ్యాచ్‌ను కళాశాల కరస్పాండెంట్‌ శ్రీమంతుల లక్ష్మణరావు ప్రారంభించారు. వేడుకలో ఆయా కళాశాలల ప్రధానాచార్యులు డాక్టర్‌ పి.రవికుమార్‌, జడ్‌.వి.నిరంజన్‌ తదితరులు పాల్గొన్నారు. గురువారం అన్ని విభాగాల్లోనూ ఫైనల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి.

గుంటూరు గెలుపు...
ఉదయం బీబీహెచ్‌ మైదానంలో గుంటూరు (జేకేసీ జూనియర్‌ కళాశాల), పశ్చిమ గోదావరి (సీఆర్‌ రెడ్డి జూనియర్‌ కళాశాల) జూనియర్‌ జట్లు పోటీ పడ్డాయి. టాస్‌ గెలిచిన పశ్చిమ గోదావరి జట్టు బౌలింగ్‌ ఎంచుకొంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన గుంటూరు జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన పశ్చిమ గోదావరి జట్టు 18 ఓవర్లలో 112 పరుగులు మాత్రమే చేసి ఆలౌటయ్యింది. గుంటూరు జట్టు 44 పరుగుల విజయాన్ని సొంతం చేసుకుంది. జట్టులో శ్రీకాంత్‌ 63, ప్రభుకుమార్‌ 43 పరుగులు చేసి జట్టు గెలుపులో భాగస్వాములయ్యారు.

నెల్లూరు విజయం...
మధ్యాహ్నం సెయింట్‌ ఆన్స్‌ మైదానంలో నెల్లూరు (కృష్ణ చైతన్య పీజీ అండ్‌ డిగ్రీ కళాశాల), కృష్ణా (లయోలా ఇంజినీరింగ్‌ కళాశాల) సీనియర్‌ జట్లు బరిలోకి దిగాయి. టాస్‌ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకొని... 18.5 ఓవర్లలో 130 పరుగులు చేసి ఆలౌటయ్యింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన కృష్ణా జట్టు నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 116 పరుగులు మాత్రమే చేసి... ఓటమి చవి చూసింది. విజేత జట్టులో మోహన్‌ 16 బంతుల్లో 33 పరుగులు (ఏడు ఫోర్లు), నవీన్‌ 24 బంతుల్లో 30 పరుగులు (నాలుగు ఫోర్లు) సాధించారు. బౌలర్‌ రియాజ్‌ 26 పరుగులిచ్చి నాలుగు వికెట్లు పడగొట్టాడు. వీరి ఆట తీరుతో జట్టు విజయం సులువైంది.

మహిళల పోరు అదరహో...!

పశ్చిమ గోదావరి జయభేరి...
ఉదయం సెయింట్‌ ఆన్స్‌ మైదానంలో నెల్లూరు (ఎన్‌బీకేఆర్‌ ఇంజినీరింగ్‌ కళాశాల), పశ్చిమ గోదావరి (క్రికెట్‌ అసోసియేషన్‌) సీనియర్‌ మహిళా జట్లు తలపడ్డాయి. మ్యాచ్‌ ఆద్యంతం పశ్చిమ గోదావరి జట్టు హవా కొనసాగింది. చివరకు 162 పరుగుల భారీ ఆధిక్యంతో విజయభేరి మోగించింది. ముందుగా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న పశ్చిమ గోదావరి జట్టు... నిర్ణీత ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన నెల్లూరు జట్టు తొమ్మిది వికెట్లు కోల్పోయి 33 పరుగులు మాత్రమే చేయగలిగింది. విజేత జట్టులో సత్యవేణి 30 బంతుల్లో 53 పరుగులు (ఎనిమిది ఫోర్లు), ఎన్‌.లావణ్య 37 బంతుల్లో 41 పరుగులు (అయిదు ఫోర్లు) చేశారు. వీరిద్దరి భాగస్వామ్యంలోనే దాదాపు 94 పరుగులు రావడం విశేషం. బౌలర్లు శ్రీలేఖ రెండు పరుగులిచ్చి మూడు వికెట్లు, కవిత మూడు పరుగులిచ్చి రెండు వికెట్లు చేజిక్కించుకొని జట్టు భారీ విజయానికి దోహదపడ్డారు. నెల్లూరు జట్టు ఓటమి పాలైనా... ఆలౌట్‌ కాకుండా తుదివరకు క్రీజ్‌లో నిలిచిన తీరు ఆకట్టుకుంది.

నేడు ఫైనల్స్‌... (10.1.19)

సెయింట్‌ ఆన్స్‌ మైదానంలో...
ఉదయం: పశ్చిమ గోదావరి జు( గుంటూరు (మహిళా జట్లు)
మధ్యాహ్నం: నెల్లూరు జు( గుంటూరు (సీనియర్స్‌)

బీబీహెచ్‌ మైదానంలో...
ఉదయం: గుంటూరు జు (కృష్ణా (జూనియర్లు)

ఈరోజు మ్యాచ్‌లు

    ఉత్తరాంధ్ర
    సెంట్రల్‌ ఆంధ్ర
    గ్రేటర్‌
    తెలంగాణ
    రాయలసీమ

© 1995- 2018 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.